భారత్ బంకర్ బస్టర్ క్షిపణుల తయారీకి ముందడుగు వేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. బంకర్-బస్టర్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన కొత్త క్షిపణి వ్యవస్థను నిర్మించడం ద్వారా భారత్ భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సంస్కరణను అభివృద్ధి చేస్తోంది. ఇది 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించనున్న కొత్త వేరియంట్ 7500 కిలోగ్రాముల భారీ బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ క్షిపణి పేలడానికి ముందు 80 నుంచి 100 మీటర్ల భూగర్భంలోకి చొచ్చుకుపోగలదని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇరాన్‌పై 'జీబీయూ-57 ఏ/బీ' అనే ఆరు భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులు ప్రయోగించింది. ఈ బాంబులు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువుంటాయి. భూమిలోకి ముందుగా 61 మీటర్ల మేర చొచ్చుకెళ్లి.. ఆపై ఇవి పేలుతాయి. ఒకేచోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జారవిడిస్తే.. చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు. వీటిలో సంప్రదాయ వార్హెడ్లే ఉంటాయి. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ బాంబులకు దీటుగా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో బంకర్ బస్టర్లను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని మోసుకెళ్లడం కోసం విమానాలపై ఆధారపడడానికి బదులుగా బంకర్ బస్టర్‌ను 'క్షిపణి-బట్టర్'గా రూపొందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా రెండు అగ్ని-5 నూతన రకాలను అభివృద్ధి చేస్తు్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో ఒకటి భూమిపై ఉన్న లక్ష్యాల కోసం రూపొందిస్తుండగా మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించగలిగేదిగా ఉండనుంది. పాకిస్థాన్, చైనా వంటి శత్రు దేశాలలోని కమాండ్-అండ్-కంట్రోల్ కేంద్రాలు, భూగర్భ క్షిపణి, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని హైపర్సోనిక్ ఆయుధాలుగా వర్గీకరిస్తారు.
బంకర్ బస్టర్ క్షిపణుల తయారీకి భారత్ ముందడుగు
June 30, 2025
0
Tags