కొత్త జోన్ తో మసకబారానున్నదక్షిణ మధ్య రైల్వే వైభవం

Telugu Lo Computer
0

భారతీయ రైల్వేల్లో దక్షిణమధ్య రైల్వేకు ఐదోస్థానం ఉంది. ప్రయాణికుల రాకపోకల్లోనూ, సరుకు రవాణాలోనూ రికార్డుస్థాయిలో ఆదాయం వస్తుంది. అలాంటి దక్షిణమధ్య రైల్వే ఘనత ఇక మసకబారనుంది. మొట్టమొదట హైదరాబాద్‌ కేంద్రంగా నిజాం గ్యారెంటీడ్‌ స్టేట్‌ రైల్వే సేవలు ఆరంభమయ్యాయి. భారతీయ రైల్వేలో విలీనమైన తరువాత 1966 అక్టోబర్‌ 2వ తేదీన దక్షిణమధ్య రైల్వే జోన్‌  ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంతభాగంతో కలిపి మొత్తం 6 డివిజన్‌లతో సేవలందజేస్తున్న దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధి ప్రస్తుత విభజనతో గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం సుమారు 650 రైళ్లు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తున్నాయి. 12 లక్షల మందికి పైగా ప్రయాణికులు దక్షిణమధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుతో దక్షిణమధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రయాణికులు, రైళ్ల రాకపోకలతో పాటు, ఆదాయం కూడా భారీగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నగరంలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో సగానికి పైగా కొత్త జోన్‌కు తరలి వెళ్లనున్నారు. డివిజన్‌ల సంఖ్య కూడా 6 నుంచి 3 కు తగ్గనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్‌లు మాత్రమే దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉంటాయి. వీటితో పాటు లాలాగూడ వర్క్‌షాపు ఉంటుంది. అలాగే లాలాపేట్‌లోని రైల్వే కేంద్ర ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు, అధికారులు, సిబ్బంది విభజన కూడా అనివార్యం కానుంది. ప్రస్తుతం సుమారు 6400 కి.మీ.పరిధిలో దక్షిణమధ్య రైల్వే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే 12 లక్షల మంది ప్రయాణికుల ద్వారా ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. జోన్‌ విభజన వల్ల ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు తగ్గనుంది. జోన్‌ పరిధి కూడా 2500 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని జిల్లాల కంటే హైదరాబాద్‌ నుంచే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. ఆదాయార్జనలో హైదరాబాద్‌ మాత్రమే కీలకం కానుంది. 'ప్రయాణికులు ఏ జోన్‌ ప్రారంభ స్టేషన్‌ నుంచి బయలుదేరితే టిక్కెట్‌లపైన వచ్చే ఆదాయం ఆ జోన్‌కే చెందుతుంది. ఈ లెక్కన విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి లభించే ఆదాయం దక్షిణ కోస్తా జోన్‌కు వెళ్లనుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే ప్రయాణికుల ఆదాయం దక్షిణమధ్య రైల్వేకు లభిస్తుంది. దీంతో ఈ జోన్‌ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పటికే దక్షిణకోస్తా జనరల్‌ మేనేజర్‌ నియామకం పూర్తయిన దృష్ట్యా మరో ఐదారు నెలల్లో జోన్‌లోని అన్ని విభాగాల విభజన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి అభిప్రాయపడ్డారు. దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలోని అన్ని విభాగాల్లో 1.05 లక్షల మంది పనిచేయవలసి ఉండగా ప్రస్తుతం 92 వేల మంది పని చేస్తున్నారు. 14 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డివిజన్‌లలో విధులు నిర్వహించే డివిజనల్‌ రైల్వేమేనేజర్‌లు మొదలుకొని ఆయా డివిజన్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది యదావిధిగా అక్కడే ఉంటారు. కానీ హైదరాబాద్‌ కేంద్రంగా ఉమ్మడి కార్యాలయాలుగా ఉన్న రైల్‌నిలయం, లేఖాభవన్, రైల్‌ నిర్మాణ్‌ భవన్, రైల్వే కేంద్రీయ ఆసుపత్రిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది మాత్రం రెండు జోన్‌లకు చెందనున్నారు. ఈ కార్యాలయాల్లో 3500 మందికి పైగా పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో 2000 మందికి పైగా దక్షిణ కోస్తాకు బదిలీ కానున్నారు. విభజన ఏర్పాట్లు ప్రాథమిక దశలో ఉన్నాయని, అన్ని అంశాల్లోనూ త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒక అధికారి వివరించారు. పూర్తిస్థాయి విభజన జరిగిన తరువాత కొత్త జోన్‌ అవతరణ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)