ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని ఆ పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రుల దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు రేపు విచారణ చేయనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిన విషయం విదితమే.. దీంతో, ఈ నెల 20వ తేదీన తుది నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి.. అయితే, విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల ఆయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన.. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.. 2007 డిసెంబర్27వ తేదీన జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, 2018లో ఈ కేసును పునర్‌విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.. తొలుత సిట్‌కి ఆ బాధ్యతలు అప్పగించిన హైకోర్టు సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిది.. దీంతో, విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో సీబీఐ అధికారులు హైకోర్టుకు అందజేశారు. తాజాగా ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)