భార్యను డంబెల్‌తో కొట్టి చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న భర్త

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం 54వ వార్డు పరిధిలోని రెడ్డికంచరపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పాటు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో డంబెల్‌తో దాడి చేసి హతమార్చిన భర్త అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డికంచరపాలెం వివేకానంద వీధిలో నివాస ఉంటున్న నందిగామ గోపీనాథ్‌ (42) పెయింటింగ్‌ పనులు చేసేవాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి (37), కుమారుడు జశ్వంత్‌ రీతు (14), కుమార్తె లక్ష్మీప్రియ (10) ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల తిరిగి భర్త వద్దకు వచ్చింది. అయితే వచ్చినప్పటి నుంచి భార్యను గోపీనాథ్‌ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక వెంకటలక్ష్మి ఈమధ్య కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని గోపీనాథ్‌ ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోతూ ఇంట్లో ఉన్న డంబెల్‌తో కొట్టి వెంకటలక్ష్మిని గోపీనాథ్‌ హతమార్చాడు. ఆ తరువాత తాను వేరొక గదిలోకి వెళ్లి గడియ పెట్టి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య గొడవ సమయంలో అడ్డుకోవడానికి ఇద్దరు పిల్లలు యత్నించగా వారిని గోపీనాథ్‌ వేరొక గదిలో పెట్టి తలుపులు వేసినట్టు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భర్త వేధింపులపై వెంకటలక్ష్మి కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, గోపీనాథ్‌పై చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)