తెలంగాణలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మర్రిగూడెం సమీరంలో ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ కండక్టర్ సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సాధారణంగా ప్రయాణిస్తున్నప్పటికీ ట్యాంకర్ డ్రైవర్ వేగంగా, నియంత్రణ లేకుండా వాహనాన్ని నడిపిస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం అనంతరం గాయపడినవారిని స్థానికులు, పోలీసులు అంబులెన్స్లలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతమందికి తలకు గాయాలు కాగా, మరి కొంత మందికి చేతులు, కాళ్లకు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రస్తుతం ప్రమాదమేగాని స్థితిలో ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బస్సు లోపల ప్రయాణికులు అరుస్తూ, కేకలు వేస్తూ భయానక దృశ్యాలు కనిపించాయి. కొంతమంది బస్సు లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. డ్రైవర్ కు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించి మద్యం మోతాదును నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఖమ్మంలో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన పెట్రోల్ ట్యాంకర్ : పలువురికి తీవ్ర గాయాలు
June 14, 2025
0
Tags