మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి వాటిలోని పైపులను వాడుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఆ మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతోందని, అంత ఖర్చు పెట్టినా వరద ఉద్ధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఆ మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తి చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ''మూడు ప్రాజెక్టులు తీసేయడం వల్ల కేవలం రూ.10వేల కోట్ల నష్టం వస్తుంది. వీటికి మరమ్మతులు చేసే బదులు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో గోదావరిపై 14 చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని నేను చెప్పలేదు. కేవలం ఆ మూడు బ్యారేజీలపై మాత్రమే మా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణను సంప్రదించకుండా ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు చేపడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపేయాలి. పరివాహక ప్రాంతాల వారీగా నిబంధనల మేరకు నీటి వాటాలు జరగాలి. ఇద్దరు సీఎంలు కూర్చొని బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుకోవాలి. నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు కడుతున్న ఏపీకి కొత్త ప్రాజెక్టులు ఎందుకు? తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి''అని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుతో మరో 14 ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు !
June 20, 2025
0
Tags