ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు మీడియాతో చిట్‌చాట్ చేశారు. దానిలో మాట్లాడుతూ గోదావరి - బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని ఈ భేటీలో చర్చించిన తర్వాత చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొదట సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వాన్నిఏపీ బనకచర్లపై సంప్రదించిందని, అదే తమ అభ్యంతరమని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందుకు అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎవరితోనూ తాము వివాదం కోరుకోవడం లేదని, ఎవరికోసం తెలంగాణ హక్కులు వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణాజిల్లాలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీకి తాను అడిగినందుకు మాజీ మంత్రి హరీష్‌రావు తప్పుపడుతున్నారని, హరీష్‌రావు వాదనలో పస లేదని చెప్పారు. 2023లో కేంద్రానికి హరీష్‌రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తు చేశారు. తెలంగాణలో తమ ప్రాజెక్ట్‌లు పూర్తయి, పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ వారి ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. నీళ్లు, నిధుల పేరిట మోసపూరిత సెంటిమెంట్‌ని గతంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుపెట్టుకున్నారని, ఇప్పుడు జలాలను సంజీవని అని భావిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని.. మరీ ఇప్పుడు గోదావరి జలాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించారని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచింది కేసీఆర్, హరీష్‌రావులే అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు.
గోదావరి - బనకచర్లపై చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం !
June 20, 2025
0
Tags