కడప మేయర్‌ ఛాంబర్‌కు నోటీసు అంటించిన సిబ్బంది

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కుర్చీ వివాదం నేపథ్యంలో కమిషనర్‌ మనోజ్‌రెడ్డి పేరుతో మధ్యాహ్నం 2గంటలకు మేయర్‌ సురేష్‌బాబు ఛాంబర్‌కు సిబ్బంది నోటీసు అంటించారు. అంతకుముందే సమావేశపు హాల్లో ఉదయం 11 గంటల నుంచి అధికారులు అందుబాటులో ఉన్నా, మేయర్, కొందరు కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 13న సభ్యులకు పంపించిన నోటీసుల ప్రకారం కౌన్సిల్ హాల్‌లోనే సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం నుంచి కౌన్సిల్ సమావేశం హాలు సిద్ధం కావడంతోపాటు అధికారులందరూ హాజరైనా మేయర్, కొందరు కార్పొరేటర్లు హాజరు కాలేదని వివరించారు. ఈ సందర్భంలో కోరం లేని కారణంగా సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లుగా పరిగణించాలని కమిషనర్ మనోజ్ రెడ్డి పంపిన నోటీసులో పేర్కొన్నారు. కమిషనర్ నోటీసుపై మేయర్ సురేష్ బాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగింది. ఇప్పటికే రెండుసార్లు జరిగిన సమావేశంలో తెదేపాకు చెందిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో పాటు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్‌ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చొనేందుకు కేటాయించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్‌ హాల్లోకి వైకాపాకు చెందిన మేయర్‌ సురేశ్‌బాబు, కార్పొరేటర్లు రాలేదు. తెదేపా ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాత్రమే వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. మరోవైపు మేయర్‌ 38 వైకాపా కార్పొరేటర్లతో తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్‌ సురేశ్‌బాబు అభ్యంతరం తెలిపారు. మీటింగ్‌ హాల్‌లో కాకుండా తన ఛాంబర్‌లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి, తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఈ గందరగోళం నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)