మాయావతి మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగింత !

Telugu Lo Computer
0


హుజన్ సమాజ్ పార్టీ  చీఫ్ మాయావతి తిరిగి తన మేనల్లుడుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌గా ఆయనను నియమించారు. ఢిల్లీ లోథిరోడ్‌లోని సెంట్రల్ ఆఫీస్‌లో బీఎస్‌పీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారంనాడు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో పాటు జాతీయ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆకాష్ ఆనంద్‌కు పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌గా మాయావతి బాధ్యతలు అప్పగించారు. ఈసారి పార్టీని, పార్టీ ఉద్యమాన్ని అత్యంత జాగరూకతతో, నిబద్ధతతో ఆయన ముందుకు తీసుకు వెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు గత మార్చి 3న మాయావతి ప్రకటించారు. ఆకాష్ తన మామగారైన అశోక్ సిద్ధార్ధ్ ప్రభావానికి లోనుకావడంతో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీ నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆకాష్‌ను అంతకు ముందు తన రాజకీయ వారసుడిగా కూడా మాయావతి ప్రకటించారు. పార్టీ నుంచి బహిష్కరించిన 40 రోజుల తర్వాత తిరిగి ఏప్రిల్ 13న ఆయనను పార్టీలోకి మాయవతి తీసుకున్నారు. గతంలో చేసిన పొరపాట్లకు ఆకాష్ విచారం వ్యక్తం చేయడంతో మాయవతి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)