స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా తిరుమలలో స్ఛచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమం ఏర్పాటైంది. స్థానిక బాలాజీ నగర్ లో టీటీడీ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, స్థానికులు, భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని, స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. స్థానికులకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వారితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజూ లక్షలాదిమంది విచ్చేసే తిరుమల క్షేత్రంలో పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని వెంకయ్య చౌదరి అన్నారు. స్థానికులు వ్యాపారం చేసే క్రమంలో స్వచ్ఛతకు తిలోదకాలు ఇవ్వకుండా భక్తులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందిచాలని సూచించారు. వేసవిలో భక్తులకు దుకాణాల వద్ద విరివిగా మంచినీరు అందించాలని కోరారు. స్థానికులు పరిసరాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. టీటీడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే స్థానికుల సహకారం తప్పనిసరి అని తెలిపారు. స్థానికులందరూ కూడా టీటీడీ మార్గదర్శకాలను పాటిస్తూ స్వచ్ఛ తిరుమలలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. ఇదివరకు చేపట్టిన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనుల గురించి అధికారులు వివరించారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొదటి ఘాట్ రోడ్‌లోని కుంకాల పాయింట్ వద్ద చెత్త ఏరివేత కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిను బండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తోన్నారని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున చెత్త పోగయ్యిందని, స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ చెత్తను తొలగించామని వివరించారు. భక్తులందరూ డస్ట్ బిన్లలో చెత్త వేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు. తిరుమలను పరిశుభ్రంగా ఉంచడానికి 6,000 మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తోన్నారని చెప్పారు. వారి కృషిని, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల నుండి బయటకు చెత్త విసరడం మానుకోవాలని కోరారు.
స్ఛచ్ఛాంధ్ర - స్వచ్ఛ తిరుమల
May 17, 2025
0
Tags