ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం తాడిచెట్లపాలెం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి ఆమె స్పందించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఉదయం హోంమంత్రి అనిత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో తాడిచెట్లపాలెం వద్ద ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై అచేతనంగా పడివున్నాడు. అదే సమయంలో గాయపడ్డ ఓ వృద్ధురాలు కూడా అక్కడే ఉండటం గమనించిన మంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. గాయపడిన వారికి దగ్గరకు వెళ్లి స్వయంగా పరామర్శించిన ఆమె, వారికి ధైర్యం చెబుతూ.. "ఏం కాదమ్మా, మీరు బాగుపడతారు" అంటూ ఊరటనిచ్చారు. వెంటనే పోలీసులకు ఆదేశించి, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు, సామాజిక వర్గాలు హోంమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంత్రిగా ఉన్నా కానీ ఒక సాధారణ మహిళగా స్పందించి క్షతగాత్రులకు అండగా నిలవడం నిజంగా అభినందనీయమని అంటున్నారు.
మరోసారి మానవత్వం చాటుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత
May 17, 2025
0
Tags