తిరుమలలో గతవారం ఒక డ్రైవర్ నమాజ్ చేయడం వివాదాస్పదమైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తిరుమల కళ్యాణ వేదికపై నమాజ్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు తెలియక చేశాడా, లేక తెలిసి చేశాడా అనే చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ నెటిజన్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ఈ ఘటన వెనుక ఏం జరిగిందో చెప్పారు. తాను చెప్పిందే జరిగిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఒక జర్నలిస్టు కూడా కావడం విశేషం. ఈ ఘటనపై స్పందించిన నెటిజన్.. 'డ్రైవర్ అయి ఉండాలి. వీడియో తీసిన వాడిని పట్టుకుంటే డెలిబరేటా? అవుటాఫ్ ఇన్నోసెన్సా తేలుతుంది' అని తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. 'ఏపీ గవర్నమెంట్ నేను చెప్పినట్లే చేసింది. వీడియో తీసిన వాడిని పట్టుకుంటే అసలు విషయం బయటికి వచ్చింది. ముస్లిం డ్రైవర్ ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చా అని అడిగాడట. వచ్చు అని చెప్పాడు. తను చేస్తుంటే వీడియో తీశాడు. అంటే డెలిబరేట్ వీడియో. ఇన్నోసెంట్ ప్రార్థన' అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ వీడియో తీసిన వ్యక్తిని పట్టుకుని ఆరా తీస్తే.. ఈ ఘటన వెనుక అసలు సంగతి తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. తిరుమలలో గత గురువారం ఈ ఘటన జరిగింది. మే 22న మధ్యాహ్నం TN 83 T 6705 నెంబరు గల కారులో ఒక వ్యక్తి వచ్చారు. కొంతసేపు పార్కింగ్ దగ్గర ఉన్న తర్వాతకల్యాణ వేదికపైకి వెళ్లి తన దగ్గర ఉన్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు. ఆ తరువాత కారులో తిరుమల నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక భక్త బృందంతో వచ్చిన డ్రైవర్ వారు దర్శనానికి వెళ్ళిన తరువాత నమాజ్ చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి తిరుమల నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. అనంతరం టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నమాజ్ చేసిన వ్యక్తిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నెంబరు ఆధారంగా అతన్ని చెన్నైకి చెందిన అబ్బాస్‌గా గుర్తించారు. 'ఇక్కడ నమాజ్ చేయవచ్చా అని సమీపంలోని మరో వ్యక్తిని అడిగిన క్రమంలో చేసుకోవచ్చని చెప్పాడని, దాంతో నమాజ్ చేశాడని' పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా తేలినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు, టీటీడీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
తిరుమలో నమాజ్ చేసిన వ్యక్తి !
May 28, 2025
0
Tags