మదుపర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్వయంగా తెలిపారు. ఎస్‌ఎస్‌ఈ ఐపీఓకు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలు త్వరలోనే తొలగనున్నాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెబీ చీఫ్ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ గురించి ప్రస్తావించారు. త్వరలోనే అన్ని అవాంతరాలు దాటుకొని ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు వస్తుందని తెలిపారు. అయితే ఎప్పటిలోగా ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. రెగ్యులేటరీ ఆందోళన నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రతిపాదన గత ఎనిమిదేళ్లకు పైగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్దనే పెండింగ్‌లో ఉంది. సిబ్బందికి ఇచ్చే పరిహారం, క్లియరింగ్ కార్పొరేషన్‌లో యాజమాన్యం, టెక్నాలజీ వంటి అనేక అంశాలపై సెబీ పలు ప్రశ్నలు సంధించింది. దీని కారణంగా ఐపీఓ రాక ఆలస్యం అవుతూనే వస్తోంది. అయితే తాజాగా ఎస్‌ఎస్‌ఈ తన లిస్టింగ్ ప్రక్రియను పునఃప్రారంభించింది. సెబీ వద్ద నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసింది. ఎన్‌ఎస్‌ఈ 2016 నుంచి ఐపీఓకు రావాలని చూస్తోంది. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తోంది. 2019లో ఒకసారి, 2020లో రెండు సార్లు, 2024 ఆగస్టులో కూడా ఐపీఓ కోసం అభ్యర్థనలు చేసింది. ఇలా ఐపీఓ ప్రతిపాదన సెబీ వద్ద ఎనిమిది సంవత్సరాలకు పైగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. 2024 బుర్గండీ ప్రైవేట్ హురూన్ ఇండియా 500 జాబితా ప్రకారం.. ఎన్‌ఎస్‌ఈ విలువ సుమారు రూ.4.7 లక్షల కోట్లుగా ఉంది. దీంతో భారత్‌లోనే 10వ అత్యంత విలువైన ప్రైవేటు కంపెనీగా నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తరచుగా కాంట్రాక్ట్‌ల గడువును మార్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌ఎస్‌ఈ ప్రస్తుతం ఉన్న గురువారంగా ఉన్న కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీని మంగళవారానికి మార్చాలని సెబీని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీలపై ఈ నెలలోపు సెబీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లుు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో నేడు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ షేర్లు 3 శాతం మేర నష్టపోయాయి.
త్వరలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ ?
May 22, 2025
0
Tags