భారత్ డిఫెన్స్ వెబ్‌సైట్లు లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ ముఠా దాడులు !

Telugu Lo Computer
0


పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న సైబర్ ముఠాలు మన రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిలిటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌, మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటా హ్యాకర్ల చేతికి వచ్చిందని పాకిస్థాన్‌ సైబర్ ఫోర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించుకుంది. అలాగే రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్‌డ్‌ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. దానికి సంబంధించిన చిత్రాలను పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ సంస్థ ఆన్‌లైన్ వ్యవస్థను నిలిపివేసి, నష్టాన్ని అంచనావేస్తున్నారు. ఇతర దాడులను గుర్తించి, అడ్డుకునేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్‌లో పది లక్షల సైబర్ దాడులు చోటుచేసుకున్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం రెండురోజుల క్రితం వెల్లడించింది. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఇవి జరిగినట్లు తెలిపింది. అలాగే జమ్ము మున్సిపల్‌ కార్పొరేషన్‌పై సైబర్‌దాడి జరిగిందని  కీలకమైన డేటాను హ్యాకర్లు దొంగిలించారని అధికారులు వెల్లడించారు. ఈ దాడి జరగడంతో ప్రభుత్వ డేటాకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు పోయినట్లు తెలిపారు. వైబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దాడులతో భారత ప్రభుత్వం సైబర్‌ సెక్యూరిటీ అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు తమ సైబర్‌ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలని అధికారులకు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)