మోడీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం : సీఎం చంద్రబాబు

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు, డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను భారత్‌ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు. ''ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోడీ ప్రధానిగా ఉన్నారు. మోడీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నాను, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటున్నాను. విశాఖలో టీసీఎస్‌ మొదలవుతోంది. ఆర్సెల్లార్‌ మిట్టల్‌ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్‌ రాబోతోంది. ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీ.. అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్‌ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో రూ.5లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి. మైనింగ్‌, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయి. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటవుతోంది. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే నా లక్ష్యం. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 7-8 ఏళ్లు సీఐఐ సదస్సులు నిర్వహించాం. మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చాను'' అని చంద్రబాబు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)