మానవీయ సాయం అందకుండా అడ్డుకుంటే టెల్‌ అవీవ్‌పై కఠిన వైఖరి అవలంబిస్తాం : ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ హెచ్చరిక

Telugu Lo Computer
0


మానవీయ సాయం అందకుండా అడ్డుకుంటే టెల్‌ అవీవ్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ హెచ్చరించారు. ప్యారిస్‌ రెండు దేశాల సిద్ధాంతానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ''మానవీయ సాయానికి అడ్డంకులు భరించలేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు స్పందించకపోతే పరిస్థితి గంటలు, రోజుల్లోనే దిగజారిపోతుంది. అందుకే మేం సమష్టిగా కఠిన వైఖరి అవలంభిస్తాం. ఇజ్రాయెల్‌పై ఆంక్షల అంశాన్ని కూడా ఫ్రాన్స్‌ పరిశీలిస్తుంది. మేం మానవతా సాయం అందించడానికి వీలుగా ఇజ్రాయెల్‌ తన వైఖరి మార్చుకొంటుందని ఆశిస్తున్నాను. పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని నమ్ముతున్నాం. పాలస్తీనా ఉండాల్సిన అవసరం చాలా ఉంది'' అని మెక్రాన్‌ పేర్కొన్నారు. ఆ సమయంలో సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ కూడా పక్కనే ఉన్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన ఇజ్రాయెల్‌ 11 వారాల బ్లాకేడ్‌ను ఇటీవలే తొలగించింది. పరిమిత స్థాయిలో సహాయాన్ని అనుమతించింది. ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ పాలస్తీనా ఏర్పాటు వైపు మొగ్గు చూపారు. ఇది ఇజ్రాయెల్‌ ఆగ్రహానికి కారణం కాగా.. పశ్చిమ దేశాల్లో విభేదాలను తీవ్రం చేసింది. జూన్‌ 17- 20 మధ్య ఐరాస సమావేశంలో పాలస్తీనా ఏర్పాటుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్‌ సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)