ఏసీబీ అధికారులకు భయపడి అపార్ట్‌మెంట్ కిటీకీ నుంచి రూ.500 నోట్ల కట్టల విసిరేసిన చీఫ్ ఇంజనీర్‌ !

Telugu Lo Computer
0


డిశా రాజధాని భువనేశ్వర్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న బైకుంఠ నాథ్ సారంగి అక్రమాస్తులు, అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా విజిలెన్స్ విభాగం ఒకేసారి ఏడు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో అతడు తన ఇంటిలోని రూ.2 కోట్లకుపైగా నగదును కిటికీల్లో నుంచి బయటకు విసిరేశాడు. బైకుంఠ నాథ్‌తో పాటు ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు జరిపారు. అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి) ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో మొత్తం రూ. 2.1 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్‌లోని కరడగడియా ప్రాంతంలో ద్విమహాల నివాస భవనం, భువనేశ్వర్‌లోని డుమ్డుమా ఫ్లాట్, పూరిలోని మరో ఫ్లాట్, అంగుల్‌లోని శిక్ష్యకపాడా వద్ద బంధువు నివాసం, సారంగి తండ్రి భవనం, కార్యాలయ ఛాంబర్‌లో విజిలెన్స్ నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అతడి అక్రమాస్తుల చిట్టాను చూసి అధికారులే షాకయ్యారు. నోట్ల కట్టలు, భారీగా బంగారం, నగలు, భూములు, స్థలాలకు సంబంధించిన పత్రాలు వెలుగుచూశాయి. అక్రమార్జనకు అలవాటుపడిన ఆయన అవినీతికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అంగూల్ నివాసంలో రూ. 1.1 కోట్లు, భువనేశ్వర్‌ ఫ్లాట్‌లో కోటి రూపాయాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. విజిలెన్స్ అధికారులు భువనేశ్వర్ ఫ్లాట్‌కు చేరుకున్న సమయంలో బైకుంఠ సారంగి ఇంట్లో దాచిపెట్టిన నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు విసిరేశాడని పేర్కొన్నారు. అయితే ఆ నగదును సాక్షుల సమక్షంలో తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొరికిన సొమ్ములో ఎక్కువ మొత్తంలో రూ.500నోట్లు, కొన్ని రూ.200, రూ.100 నోట్ల కట్టలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనతో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం, సంబంధిత శాఖలపై దృష్టి కేంద్రీకరించిన విజిలెన్స్,.. ఆయనపై అక్రమాస్తులు అవినీతి నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసింది. అయితే, ఆయన ఇంటిలో లభ్యమైన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని, కేవలం నగదు మాత్రమే ఇప్పటి వరకూ రూ.2.1 కోట్లు దొరికిందని చెప్పారు. ఇంకా, ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులు, బ్యాంకు లాకర్లు ఉన్నాయనేది విచారణలో పూర్తిగా తెలుస్తుందని విజిలెన్స్ అధికారి ఒకరు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)