తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు సమావేశాల్లో ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత సభ వేదిక పైనే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి రెండేళ్లకోసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఆయన్ని ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఈ పదవిలో మరొక రెండేళ్లు కొనసాగనున్నారు. చంద్రబాబు తొలిసారి 1995లో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి గత 30 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా ఈ పదవిలో కొనసాగుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర విభజన (2014) వరకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆయన ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో అనుభవం, నాయకత్వ నైపుణ్యం, పార్టీపై ఆయనకు ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై చేస్తున్న కృషి వంటివి చంద్రబాబును మరోసారి అగ్రస్థానానికి చేర్చాయని ఆయన అభిమానులు కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును ఈ పదవికి ఎన్నుకోవడం ద్వారా పార్టీలో ఆయన నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసం, మద్దతు మరోసారి స్పష్టమైందని కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)