రివర్స్‌ వేలంలో 150 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను పొందిన బీసీ జిందాల్‌ గ్రూప్‌

Telugu Lo Computer
0


సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిర్వహించిన రివర్స్‌ వేలంలో 'బీసీ జిందాల్‌ గ్రూప్‌' 150 మెగావాట్ల రౌండ్‌-ది-క్లాక్‌ ప్రాజెక్ట్‌ను పొందినట్లు ఈ రోజు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.5.07/kWh టారిఫ్‌తో పొందింది. ఉత్పత్తి అయిన విద్యుత్తును సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కింద డిస్కంలకు సరఫరా చేస్తారు. జిందాల్‌ ఇండియా రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇటీవల రెండు 300 మెగావాట్ల సోలార్‌ ప్లస్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను సంపాదించింది. 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి 2.50 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టాలని గ్రూప్‌ యోచిస్తోంది. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్‌ శక్తిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం ఏడాదికి 50 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించాలని చూస్తోంది. గత దశాబ్దంలో భారతదేశం తన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో మూడు రెట్లు వృద్ధిని నమోదు చేసింది, మార్చి 2014లో 75.52 గిగావాట్ల సామర్థ్యంతో పోలిస్తే, గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం పెద్ద జల విద్యుత్ ప్లాంట్లతో సహా 232 గిగావాట్లకు చేరుకుందని అధికారిక వర్గాలు పీటీఐకు తెలిపాయి. 2014, మార్చిలో, దేశీయ సౌర విద్యుత్‌ శక్తి సామర్థ్యం 2.82 గిగావాట్లుగా ఉంది. ఇది ఇప్పుడు 108 గిగావాట్లను దాటి అనేక రెట్ల వృద్ధిని నమోదు చేసింది. 2014లో 21 గిగావాట్లుగా ఉన్న పవన విద్యుత్‌ శక్తి సామర్థ్యం ప్రస్తుతం రెట్టింపు కంటే ఎక్కువగా 51 గిగావాట్లకు చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)