ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసింది !
May 12, 2025
0
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. గత నాలుగు రోజులుగా భారత సైన్య సంయమనాన్ని, సామర్థ్యాన్ని చూస్తున్నామని అన్నారు. నిఘా వర్గాల సామర్థ్యాన్ని, మన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసిందని తెలిపారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసిందని అన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని మోడీ చెప్పారు. మన రక్షణ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానీకమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ మొత్తం నివ్వెరబోయిందని, అందరి హృదయాలు జ్వలించిపోయాయని తెలిపారు. మన రక్షక దళాల వీరత్వాన్ని, ధైర్యాన్ని దేశంలోని ప్రతి తల్లికి, ప్రతి సోదరికి, ప్రతి కూతురికి అంకితం చేస్తున్నానని మోదీ చెప్పారు. మన మహిళల సిందూరాన్ని తుడిచిని వారిని బూడిద చేశామని తెలిపారు. కుటుంబ సభ్యుల ముందే టూరిస్టులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చిచంపారని మోడీ తెలిపారు. 25 ఏళ్లుగా పాకిస్థాన్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాదుల తండాలను ఒక్కసారిగా మన సైన్యం తుడిచిపెట్టిందని చెప్పారు. మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారిని తుదముట్టించామని తెలిపారు. భారత్ దెబ్బకు పాకిస్థాన్ నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిందని చెప్పారు. భారత్ ప్రతిచర్యలకు పాకిస్తాన్ భయపడిపోయి కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని చెప్పారు. భారత మహిళల సిందూరాన్ని తుడిచి వారికి బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు.
Tags