అమెరికాలోని టెక్సాస్‌లో పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ హది, ముర్షిద్ (39), మహమ్మద్ సల్మాన్ (35)లను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఉద్యోగాలు సృష్టించినట్లు నకిలీ పత్రాలు సమర్పించి అక్రమంగా వీసాలు పొంది, వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు. ఇందుకు ఈబీ-2, ఈబీ-3, హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌లను ఉపయోగించేవారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు, లేబర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లున్న నకిలీ ఉద్యోగ ప్రకటనలను పత్రికల్లో పబ్లిష్ చేయిస్తుంది. ఒక్కసారి అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్‌కార్డులను మంజూరు చేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని అభ్యర్థిస్తారు. వీరి గుట్టు కాస్త బయట పడటంతో ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు. విచారణలో ముర్షిద్ చట్టవిరుద్ధంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు యత్నించినట్లు తేలింది. వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఎఫ్‌బీఐ డల్లాస్ స్పెషల్ ఏజెంట్ ఒకరు పేర్కొన్నారు. జాతీయ భద్రతను కాపాడటానికి, ఇమిగ్రేషన్‌కు బలమైన చట్టాలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది. వీరు దోషులుగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు
May 25, 2025
0
Tags