పాకిస్తాన్ గూఢచారులకు కీలక సమాచారం లీక్‌ చేసిన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోతీరామ్‌ జాట్‌

Telugu Lo Computer
0


పాకిస్తాన్ గూఢచారులు టీవీ జర్నలిస్టుల ముసుగులో సీఆర్‌పీఎఫ్‌ అధికారికి గాలం వేసినట్లు తేలింది. కీలక సమాచారం లీక్‌ చేస్తే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో అరెస్టైన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోతీరామ్‌ జాట్‌ను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్‌షా పర్యాటన వివరాలు, 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సీఆర్‌పీఎఫ్‌ బలగాల సంఖ్య, వాటి కదలికలు, పహల్గాం ఉగ్రవాదులు నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని అతడు వారికి చేరవేసినట్లు గుర్తించారని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. అతడు దాదాపు రెండేళ్లుగా టీవీ జర్నలిస్టుల ముసుగులో ఉన్న పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లకు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్‌ 22కు దాదాపు ఐదు రోజుల ముందు వరకు అతడు అక్కడి సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌లోనే విధులు నిర్వహించాడు. ''ఛండీగఢ్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌గా తనను తాను పరిచయం చేసుకొంటూ ఓ మహిళ అతడిని సంప్రదించింది. కొంత సమాచారం ఇవ్వాలని ఆమె కోరింది. వీరి మధ్య కొన్ని ఫోన్‌, వీడియో కాల్స్, మెసేజ్‌లు చోటుచేసుకొన్నాయి. ఆ తర్వాత నుంచి మోతీరామ్‌ జాట్‌ ఆమెకు కీలక సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మూడు నెలలకు పాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకడు అదే న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్నట్లు చెప్పి పరిచయం చేసుకొన్నాడు. అతడు భద్రతా దళాల మోహరింపునకు సంబంధించి కీలక సమాచారం, పత్రాలను పాక్‌కు అందించాడు. వీటిల్లో దళాల కదలికలు, మల్టీ ఏజెన్సీ సెంటర్‌ ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన లొకేషన్లు కూడా వీటిల్లో ఉన్నాయి. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని పంపొద్దని పాక్‌కు చెందిన వ్యక్తి మోతీరామ్‌కు సూచించాడు. పాక్‌లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైన నాటినుంచి ప్రతినెలా నాలుగో తేదీన రూ.3,500 అతడికి అందాయి. ఇక కీలక సమాచారం అందజేసిన ప్రతిసారీ రూ.12,000 ముట్టజెప్పారు. ఈ సొమ్మును మోతీరామ్‌, అతడి భార్య ఖాతాకు అందేవి. అమిత్‌షా పర్యటన, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం బహిరంగంగానే అందుబాటులో ఉంది. కానీ, అతడు ఢిల్లీ వెళ్లాక కూడా భద్రతా కారణాలతో కశ్మీర్‌లో మూతపడిన 50 పర్యాటక ప్రాంతాల జాబితాను పాక్‌కు అందజేశాడు'' అని సీఆర్పీఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మోతీరామ్‌ పాక్‌కు అందించిన సమాచారానికి సంబంధించి ఎటువంటి మెసేజ్‌లను ఫోన్‌ నుంచి డిలీట్‌ చేయలేదని అధికారులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)