ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం డిప్యూటీ మేయర్‌తో పాటు పలు చోట్ల ఛైర్మన్, ఉప ఛైర్మన్ ఎన్నిక వాయిదా సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఇలాంటివి జరగకుండా బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. బియ్యం ఇచ్చే రోజు తప్ప రేషన్ వాహనాల వల్ల ఉపయోగం లేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. వికలాంగులు, వృద్ధులకు ఇళ్ల వద్దే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన వారికి రేషన్ దుకాణాల ద్వారానే ఇకపై బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. వాహనాల ద్వారా రేషన్ సరఫరా వల్ల స్మగ్లింగ్‌కు అవకాశం ఇస్తూ పథకం దుర్వినియోగం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుకాణంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశ పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీశైలం అభివృద్ధిపై మంత్రులతో సమాలోచనలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం పంపిణీ
May 20, 2025
0