ఆంధ్రప్రదేశ్ లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్, ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఐసెట్ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాయగా 32,719మంది క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షలో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఐసెట్‌కు మొత్తంగా 37,572మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 94 పరీక్ష కేంద్రాల్లో మే 7న ఐసెట్ నిర్వహించగా 34,131మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్‌లో 32,719మంది క్వాలిఫై కాగా.. వీరిలో 15,176 మంది అబ్బాయిలు, 17,543మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనోజ్ మేకా (విశాఖ) అత్యధిక మార్కులతో ఒకటో ర్యాంకు సాధించగా, ఆ తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్‌ఆర్ కడప), ఎస్. కృష్ణసాయి (ఎన్‌టీఆర్ జిల్లా), వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్), రేవూరి మాధుర్య (గుంటూరు), షేక్ బషీరున్నీషా (అనకాపల్లి), వి. అజయ్ కుమార్ (తిరుపతి), భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పుగోదావరి), ఎస్. గణేశ్ రెడ్డి (విశాఖపట్నం), మహేంద్ర సాయి చామా (తిరుపతి) నిలిచారు.
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల : 95.86 శాతం ఉత్తీర్ణత
May 20, 2025
0
Tags