స్విగ్గీ, జొమాటో షేర్లు నేటి ట్రేడింగ్ సెషన్‌లో రాణించాయి. ఈరోజు ఇంట్రాడేలో ఇరు కంపెనీ షేర్లు దాదాపు 3.3 శాతం మేర లాభపడ్డాయి. రెయిన్ సర్‌ఛార్జ్ మినహాయింపును తొలగిస్తుండటమే ఇందుకు కారణం. ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ చందాదారులు కూడా ఈ అదనపు రుసుము భరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాన్ని ఇరు సంస్థలు అధికారికంగా వెల్లడించలేదు. స్విగ్గీ తన కస్టమర్లకు మెరుగైన సేవలు, సౌలభ్యం కోరుకొనే వినియోగదారుల కోసం స్విగ్గీ 'స్విగ్గీ వన్' పేరిట, జొమాటో 'జొమాటో గోల్డ్ ' పేరిట సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారికి ఇరు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్సి అందిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్‌ఛార్జ్ కూడా ఒకటి. అయితే తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై సాధారణ యూజర్లు మాదిరిగానే వీళ్లు కూడా ఈ రుసుము కట్టాల్సిందే. భారీగా వర్షం పడే సమయంలో ఈ సర్‌ఛార్జ్ రూ.15 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఇప్పటికే ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు క్విక్ కామర్స్ విభాగంలో పెద్ద ఎత్తున నష్టాల్ని మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు తమ నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్నాయి.
రాణించిన స్విగ్గీ, జొమాటో షేర్లు
May 16, 2025
0
Tags