పహల్గాం ఉగ్రదాడిలో కన్నుమూసిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాకు చెందిన వినయ్- హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవ జంట.. తమ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూకశ్మీర్‌కు వచ్చింది. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లై వారం కూడా గడవక ముందే.. తన కళ్ల ముందే జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతిఒక్కరిని బాధించింది. మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ నర్వాల్ సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేయడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను ట్రోల్ చేశారు. వారి చర్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ.. ఆమెపై విద్వేషంతో కూడిన కామెంట్లు చేస్తున్నవారి సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.
నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
May 06, 2025
0
Tags