టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికానికి మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి నూరు శాతం వేరియబుల్ పే అలవెన్స్‌ను చెల్లింపులు చేసినట్లు తెలిపింది. తమ తమ వ్యాపార విభాగాల పనితీరు ఆధారంగా మిగిలిన ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. ప్రతి త్రైమాసికంలోనూ టీసీఎస్ ఇదే విధానాన్ని అవలంబిస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల మార్చి నెల త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్జిన్లు తగ్గడంతో నికర లాభం 1.7 శాతం మేర క్షీణించింది. ఆదాయం మాత్రం గతేడాదితో పోలిస్తే 5.3 శాతం వృద్ధితో రూ.64,479 కోట్లుగా నమోదైంది. అయితే, త్రైమాసిక ఫలితాల సందర్భంగా 6.07 లక్షల మంది ఉద్యోగులకు వార్షిక వేతన పెంపును వాయిదా వేసినట్లు ప్రకటించింది. సుంకాల కారణంగా నెలకొన్న అనిశ్చితిని ఇందుకు కారణంగా చూపింది. సాధారణంగా ఏప్రిల్ నెలలో వేతన పెంపు ఉంటుంది.
70 శాతం మందికి నూరు శాతం వేరియబుల్ పే అలవెన్స్‌ను చెల్లించిన టీసీఎస్
May 06, 2025
0
Tags