ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో నాటో కూటమి తన తూర్పు సరిహద్దులను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జర్మనీ సైన్యం చరిత్రలోనే ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. దాదాపు 5,000 మంది జర్మన్ సైనికులను లిథువేనియాలో శాశ్వతంగా మోహరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏప్రిల్ 1న లిథువేనియా రాజధాని విల్నియస్‌లో కొత్త పాన్జర్ బ్రిగేడ్ 45 అధికారికంగా ప్రారంభమైంది. రష్యా దూకుడుకు వ్యతిరేకంగా నాటో తూర్పు సరిహద్దును సురక్షితం చేయడానికి జర్మనీ ఈ చర్య తీసుకుంది. జర్మనీ సైన్యం గతంలో ఎనిమిది బ్రిగేడ్‌లతో ఉండేది. ఇప్పుడు లిథువేనియాలో మోహరించబడిన తొమ్మిదో బ్రిగేడ్ ఇది. బుండెస్వెహర్ చరిత్రలో ఒక విదేశీ గడ్డపై సైన్యాన్ని శాశ్వతంగా మోహరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు చిహ్నంగా పాన్జర్ బ్రిగేడ్ 45 చిహ్నంలో విల్నియస్ నగరంలోని ప్రముఖ కట్టడం గెడిమినాస్ టవర్ ను కూడా చేర్చారు. సైనికులు తమ యూనిఫామ్‌లపై ఈ చిహ్నాన్ని ధరిస్తారు. జర్మన్ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ రెండు వారాల క్రితం కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుండెస్టాగ్ (పార్లమెంట్)లో తన మొదటి ప్రసంగంలో ఈ నిర్ణయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్ని రక్షించడానికి జర్మనీ సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 3 మిలియన్ల జనాభా కలిగిన లిథువేనియా, రష్యాకు చెందిన కాలినిన్‌గ్రాడ్ ఒబ్లాస్ట్, రష్యా మిత్రదేశమైన బెలారస్‌ల మధ్య ఉంది. బెలారస్‌తో దాదాపు 680 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. లిథువేనియా ప్రభుత్వం కూడా తమ సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా జర్మనీలో తయారైన 44 ఆధునిక లియోపార్డ్ 2 A8 ప్రధాన యుద్ధ ట్యాంకులను ఆర్డర్ చేసింది. ఇదే ట్యాంక్‌లను లిథువేనియాలో మోహరించిన బుండెస్వెహర్ బ్రిగేడ్ కూడా ఉపయోగించనుంది. ఇది రెండు సైన్యాల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తుంది.
లిథువేనియాలో శాశ్వతంగా 5,000 మంది జర్మన్ సైనికుల మోహరింపు ?
May 26, 2025
0
Tags