2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను డివిడెండ్‌గా రూ.2.69 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.1 లక్షల కోట్లు చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ మొత్తం 27.4 శాతం మేర పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఏటికేడు ఈ మొత్తం పెరుగుతూ వస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన 616వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రిస్క్ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కంటిజెంట్ రిస్క్ బఫర్ లెవల్‌ను కూడా 6.5 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు-కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్‌బీఐకు ఆదాయం లభిస్తుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు-పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు- తరుగుదలకు కేటాయింపులు వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తారు. ఈ మిగులు నిధులను కేంద్రానికి ఏటా బదిలీ చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.2.56 లక్షల కోట్లు సమకూరుతాయని ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ.2.69 లక్షల కోట్లు చెల్లించాలని ఆర్‌బీఐ నిర్ణయం
May 23, 2025
0
Tags