ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరం శివార్లలోని గుర్రాల కొండపై కేతిరెడ్డి ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ కొండను ఆక్రమించుకుని కేతిరెడ్డి అక్రమంగా అతిథి భవనాన్ని నిర్మించారని అధికారులు తేల్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ లో కేతిరెడ్డి పిటిషన్ విచారణకు రానుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్మించిన గెస్ట్ హౌస్ పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వివాదం నడుస్తోంది. యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించినప్పుడే ధర్మవరంలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించారని బయటపెట్టారు. అప్పట్లో కేతిరెడ్డి కూడా వెనక్కి తగ్గలేదు. లోకేశ్ ధర్మవరంలో కేతిరెడ్డి భవనం ఫొటోలు బయటపెడితే, తాను ఉండవల్లి చంద్రబాబు ఇంటి ఫొటోలు బయటపెడతానంటూ కేతిరెడ్డి అన్నారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో గుర్రాల కొండపై నిర్మించిన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, కూటమి ప్రభత్వం అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. గుర్రాల కొండపై 2.42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొత్తం ప్రభుత్వ భూమే ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 905-2లో కేతిరెడ్డి సోదరుడు వెంకట క్రిష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో ఆ భూమి కొనుగోలు చేసినట్లు కేతిరెడ్డి చెబుతున్నారు. అయితే ఈ భూమిని 65 ఏళ్ల క్రితం ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, ఓబులమ్మ, తలారి అంజినమ్మకు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ భూమిని విక్రయించడానికి వారి హక్కులేదని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో తాను కొనుగోలు చేసినని కేతిరెడ్డి చెబుతున్న స్థలం ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో గురువారం కేతిరెడ్డి మరదలు వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. గుర్రాల కొండపై నిర్మించిన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హైకోర్టు ఆదేశాల ప్రకారం సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఆ భూమి కబ్జాకు గురైనట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, రెవెన్యూ అధికారుల రాకతో కేతిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి తాళాలు వేయించారు. అధికారుల చర్యలను అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు.
గుర్రాల కొండపై కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు
April 05, 2025
0
Tags