దేశం వీడకపోతే రోజుకు వెయ్యి డాలర్ల జరిమానా !

Telugu Lo Computer
0


మెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. ఈ ప్రక్రియను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులపై తనిఖీలను మరింత ముమ్మరం చేయబోతున్నారు. అంతే కాదు అక్రమ వలసదారులుగా ఓసారి గుర్తించి దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దేశం వీడకపోతే రోజువారీగా జరిమానాలు విధించే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. వాషింగ్టన్ -రాయిటర్స్ వార్తా కథనాల ప్రకారం వలసదారులను దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చాక అమెరికాను విడిచి వెళ్లకపోతే రోజుకు 998 డాలర్ల వరకు జరిమానా విధించాలని, వారు చెల్లించకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. 1996 నాటి చట్టం ప్రకారం ఈ జరిమానాలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి పదవీకాలంలో అమలు చేశారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆ విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. వలసదారులపై మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జరిమానాలు చెల్లించని వలసదారుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ట్రంప్ పరిపాలన సిద్దమవుతోందని రాయిటర్స్ తెలిపింది. అమెరికాలో వలసదారులు గతంలో చట్టవిరుద్ధంగా సీబీపీ వన్ అని పిలువబడే మొబైల్ యాప్‌ను వాడారని, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దాన్ని సీబీపీ హోమ్‌గా రీబ్రాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమెరికా నుంచి వలసల బహిష్కరణ విషయంలో గతంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై దాఖలైన కేసులపై వివిధ స్థానిక కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టు ఇవాళ నిలిపేసింది. దీంతో వలసదారుల బహిష్కరణను తిరిగి ప్రారంభించడానికి ట్రంప్ సర్కార్ కు అనుమతి లభించింది. వలసల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠినమైన విధానానికి ఇది పాక్షిక విజయమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు నిర్ణయంతో వలసదారుల బహిష్కరణకు 1798 నాటి గ్రహాంతర శత్రువుల చట్టాన్ని ఉపయోగించడాన్ని కొనసాగించడానికి కూడా అనుమతి లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)