కెనడాలో జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు, పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నూతన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నియమితులయ్యారు. అయితే ట్రూడో నిష్క్రమణ తర్వాత లిబరల్ పార్టీ తిరిగి పుంజుకున్నట్లు పలు ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. పార్టీని ముందుకుతీసుకెళ్లడంలో మార్క్ కార్నీ తనదైన మార్క్‌ను చూపిస్తున్నారని రాజకీయ నిపుణులు పేర్కొన్నారు. ట్రూడో నుంచి మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీకి ప్రజాబలం క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. నెల రోజుల క్రితం ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కంటే చాలా వెనకబడిపోయిన లిబరల్స్ ఎన్నికలకు ముందు తిరిగి పుంజుకోవడంతో ఆ పార్టీ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు పోల్స్ పేర్కొంటున్నాయి. తాజాగా విడుదలైన నానోస్ పోల్స్ లిబరల్స్‌కు 43.7 శాతం ప్రజా మద్దతు లభించగా.. కన్జర్వేటివ్స్‌కు 36.3 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించాయి. ఓటింగ్ రోజు వరకు ఈ మద్దతు ఇలాగేఉంటే 343 మంది సభ్యులున్న కెనడియన్ పార్లమెంట్‌లో లిబరల్ పార్టీ అధిక మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి. కార్నీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కెనడా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా తమ దేశంపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకొని, తన ఆర్థికవ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం గురించి ప్రజలకు పిలుపునిచ్చారు. కెనడాను తమలో కలుపుకుంటామని అగ్రరాజ్యం చేస్తున్న బెదిరింపులను ఎదుర్కోవాలంటే దేశంలో బలమైన పార్టీ అధికారంలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. కెనడా పార్లమెంటులోని 338 స్థానాలకు ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాని కార్నీ కెనడా రాజధాని ఒట్టావా నుంచి బరిలోకి దిగుతున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై మార్చి 4 నుంచి అమెరికా 25శాతం సుంకాలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయడంలో విఫలమైతే కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ ఆ దేశానికి హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశంలో జరగనున్న ఎన్నికలు కీలకంగా మారాయి.
కెనడాలో పుంజుకున్న లిబరల్ పార్టీ !
April 22, 2025
0
Tags