వక్ఫ్ (సవరణ) బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ . ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. 'ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. భారత రాజ్యాంగంలోని సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని మేం ప్రతిఘటిస్తూనే ఉంటాం' అని ఆయన రాసుకొచ్చారు. ఈసందర్భంగా సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయాన్ని రమేశ్ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని తెలిపారు. వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. గురువారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా అర్ధరాత్రి దాటే వరకూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్ బిల్లు పేరును.. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.
వక్ఫ్ (సవరణ) బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం : కాంగ్రెస్
April 04, 2025
0
Tags