గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్లు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ ప్రకటించింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతుండగా కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో మాత్రం ధరలు భారీగా పడిపోతున్నాయని ఆ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బిల్డర్లు కాంక్రీట్ మిల్లర్లను చిన్నచూపు చూస్తూ ధరల విషయంలో మీరు కాకపోతే ఇంకొకరు అంటూ తగ్గిస్తూ వస్తున్నారని ఆ సంఘం ఆరోపిస్తోంది. ఈ కారణంగా వారం పాటు సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, కన్వీనర్లు బీసం గోపాల్, రవి కుమార్ రెడ్డి, రేపల్లె కృష్ణ వాల్మీకి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సమస్యలు వివరించారు. కాంక్రీట్ మిల్లర్ల డిమాండ్ల సాధన కోసం ఉద్యమించడానికి సిద్ధమయ్యామని ప్రకటించారు. కాంక్రీట్ మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా నియమ నిబంధనలు రూపొందించాలని.. 5000 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న పనులకు కచ్చితంగా తమ కాంక్రీట్ మిల్లర్లకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల బారిన పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడుతున్నట్లు కాంక్ట్రీట్ మిల్లర్ల సంఘం తెలిపింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న కాంక్రీట్ మిల్లర్ల జీవితాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వారం పాటు కాంక్రీట్ మిల్లర్లు సమ్మె చేపడుతుండడంతో నగరంలో భవన నిర్మాణ పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నిర్మాణ పనుల్లో కాంక్రీట్ కీలకమైనది. అది లేనిది పనులు చేయలేని పరిస్థితి. వారం పాటు సమ్మె అంటే భవన నిర్మాణాలు ఆగిపోవాల్సిందే. కాంక్రీట్ మిల్లర్లు చెబుతున్న సమస్యలు కూడా వాస్తవమే కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రియల్టర్లు, బిల్డర్లు కోరుతున్నారు.
నేటి నుంచి 12 వరకు కాంక్రీట్ మిల్లర్లు సమ్మె
April 05, 2025
0
Tags