ఆగిఉన్న సిమెంటు లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగర శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న సిమెంటు లారీని ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌ సహా నలుగురు మృతి చెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌ నుంచి కాకినాడకు రమణ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున ఏలూరు సమీప జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. దూసుకుంటూ ముందుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో బస్సు ఎడమ వైపు భాగమంతా నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన బొంతు భీమేశ్వరరావు (43), కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవారిపల్లికి చెందిన మట్టపర్తి భవాని (23), అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కోలంక పంచాయతీ ఇంజిరానికి చెందిన జుత్తిగ భవాని (28) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ మధు అలియాస్‌ నాని (30) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడగా, వారిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కలెక్టర్‌ వెట్రిసెల్వి పరామర్శించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)