గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ -2025లో 'టెర్రరిజం''లో రెండో స్థానంలో పాకిస్తాన్ నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన తాజా జీటీఐ నివేదిక ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల పరిస్థితిని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణనష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేని వెల్లడించారు. గత 5 ఏళ్లుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని, 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45 శాతం భారీగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2024లో పాక్‌లో జరిగిన 52 శాతం మరణాలకు పాక్ తాలిబాన్లు కారణమని చెప్పింది. ముఖ్యంగా ఆ దేశంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు సంభవించినట్లు చెప్పింది. భారతదేశం ఈ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టాప్-10 దేశాల జాబితాను పరిశీలిస్తే వరసగా- బుర్కినాఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్ ఉన్నాయి. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ దేశం ఉంది.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ -2025లో పాకిస్తాన్ కు రెండో స్థానం !
March 07, 2025
0
Tags