ప్రపంచ వినియోగ రాజధానిగా భారత్‌ !

Telugu Lo Computer
0


2034 నాటికి దేశంలో వినియోగం రెట్టింపు అవుతుందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమించి ప్రపంచ వినియోగ రాజధానిగా భారత్‌ అవతరించనుందని ఏంజిల్‌ వన్‌ నివేదిక వెల్లడించింది. వినియోగానికి జనరేషన్‌ జెడ్‌ ఆజ్యం పోయనుందని, అదే సమయంలో పొదుపులు కూడా దూసుకెళ్లనున్నాయని వెల్లడించింది. కావాల్సిన వస్తుసేవల కోసం పొదుపు చేసుకున్న సొమ్మునే విరివిగా వెచ్చించనున్నారని తెలిపింది. దేశంలో వినియోగం స్థూల దేశీయ ఉత్పత్తిలో (జీడీపీ) 56 శాతం వాటా కలిగి ఉందని పేర్కొంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో పన్ను ఊరట కారణంగా ప్రజల చేతుల్లోకి రూ.లక్ష కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని అంచనా. దీంతో వినియోగం రూ.3.3 లక్షల కోట్లు పెరుగుతుందని, ఇది దేశ జీడీపీని 1% పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనాలో అనవసర ఖర్చులు అవసరాలను అధిగమించాయి. సగటు ఆదాయం పెరగనుండటంతో భారతదేశంలోనూ ఆ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అమెరికాలో గతంలో తలసరి ఆదాయం బాగా పెరిగిన సమయంలో వినియోగ వ్యయం 10 రెట్లు పెరగడం గమనార్హం. తలసరి ఆదాయం పెరిగే కొద్దీ భారత వినియోగంలో కూడా ఇదే విధమైన వృద్ధిని చూడవచ్చని ఏంజెల్‌ వన్‌ నివేదిక పేర్కొంది. కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఉపకరణాలు (ఆభరణాలు సహా), ఎక్స్‌పీరియెన్స్‌ కోసం వినియోగదారులు అధికంగా ఖర్చు చేయనున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో ఇప్పటికీ 92శాతం రిటైల్‌ వ్యాపారం కిరాణా దుకాణాల ద్వారానే జరుగుతోందని, మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి ఆధునిక రిటైల్‌కు భారీ అవకాశం ఉందని తెలిపింది. యూఎస్‌ మొత్తం జనాభాను మించి భారత్‌లో జనరేషన్‌ జెడ్‌ తరం (1996-2012 మధ్య పుట్టినవారు) ఉంది. 2035 నాటికి భారత్‌లో చేసే ఖర్చులో సగం జనరేషన్‌ జెడ్‌ తరం నుంచే ఉంటుందని, భారత వినియోగ వృద్ధి పథానికి ఇది తోడ్పడుతుందని నివేదిక తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)