తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటికే ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు ఐదు వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. ఇక, ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా తిరుమలలో మంచి నీటి కోసం వినియోగిస్తున్న గాజు సీసాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్ లు అందుబాటు లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుంది. తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మరింతగా లేఖల సంఖ్య పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినా, తమ లేఖలు తీసుకోవటం లేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇక పలువురు ప్రముఖులు ప్రభుత్వంలోని కీలక విభాగాల నుంచి వచ్చే వీఐపీలతో పాటుగా దాతలు.. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే భక్తులకు మరో 1500 బ్రేక్ టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అన్ని కేటగిరీల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటున్నారు. పెరిగిన బ్రేక్ దర్శన సిఫారసులను ఎక్కడ తగ్గించాలో అర్థంకాక టీటీడీ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తెలంగాణ సిఫార్సు లేఖలతో వస్తున్న భక్తులు తమ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు.. ఈ లేఖలు - దర్శనాల విషయంలో టీటీడీ ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తిరుమల అన్నప్రసాద మెనూలో మసాలా వడ చేరిక !
March 04, 2025
0
Tags