మేనరిక, రక్తసంబంధ వివాహాలవల్ల పుట్టే పిల్లలపై జన్యు వ్యాధుల దాడి !

Telugu Lo Computer
0


మేనరకాలవల్ల ఆ దంపతులకు పుట్టే పిల్లల్లో జన్యులోపాలు తలెత్తుతున్నాయని నిమ్స్‌ జన్యు విభాగం వైద్యులు చెబుతున్నారు. నిమ్స్‌కు వచ్చే జన్యు లోపాల కేసుల్లో చాలావరకు మేనరిక వివాహాలే ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. కొన్నిసార్లు శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే జన్యు వ్యాధులు దాడి చేస్తుండగా, కొందరిలో పుట్టిన కొన్ని నెలల తర్వాత ఈ లోపాలు బయటపడుతున్నాయి. 2014లో 2,453 మంది చిన్నారులు జన్యులోపాలతో నిమ్స్‌కు రాగా, 2024లో ఆ సంఖ్య 12,042 దాటింది. ప్రధానంగా గౌచర్, విల్సన్‌ వ్యాధులు, కొందరిలో తలసీమియా, సికిల్‌సెల్‌ అనీమియా వంటి వ్యాధులు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. గౌచర్‌ వ్యాధిలో కొవ్వు విచ్ఛిన్నం జరగక ప్లీహం, కాలేయం వంటి అవయవాల్లో పేరుకుపోతుంది. దీంతో ఎముకలు బలహీనపడటంతో కీళ్ల వ్యాధులు దాడిచేస్తాయి. విల్సన్‌ వ్యాధి కాలేయంపై దాడి చేస్తుంది. కాపర్‌ నిల్వలు కాలేయంలో పేరుకుపోయి ఆ అవయవం పనితీరును దెబ్బతీస్తుంది. కొన్నాళ్లకు కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. ఈ సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు, చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో ఉచితంగా అందిస్తున్నారు. అరుదైన జన్యు వ్యాధులకు సంబంధించి 2021లో కేంద్రం జాతీయ విధానాన్ని ప్రకటించింది. ఇందులోభాగంగా నిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా ఎంపిక చేసింది. ఈ సమస్యలతో వచ్చే చిన్నారులకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)లో జన్యు పరీక్షల అనంతరం నిమ్స్‌లో జన్యు విభాగం ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 60 రకాల జన్యువ్యాధులకు నిమ్స్‌లో చికిత్సలతోపాటు పరిశోధనలు జరుగుతున్నట్లు డైరెక్టర్‌ బీరప్ప తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)