ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశం అనంతరం ఆకాశ్ విషయంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి అతడిని తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అతడి తండ్రి ఆనంద్ కుమార్‌తో పాటు రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బహుజన సమాజం అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రగతికి మాత్రమే కాకుండా యావత్ దేశాభివృద్ధికి అవసరమని మాయావతి ఉద్ఘాటించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరిస్తూ.. ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని అన్నారు. వాటి ప్రకారమే పార్టీలో పని చేసే తన కుటుంబసభ్యులను తాను ఎన్నడూ వ్యతిరేకించలేదని తెలిపారు. అయితే పార్టీ విధానాలకు హాని కలిగించే విధంగా వారిలో ఎవరైనా తన పేరును దుర్వినియోగం చేస్తే, వెంటనే వారిని పార్టీ నుంచి తొలగిస్తానని పేర్కొన్నారు. ఈ నియమానికి అనుగుణంగానే బీఎస్పీ సంస్థాగత బలాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను గతంలో పార్టీ నుంచి బహిష్కరించారని..ఇప్పుడు తన అల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నానని స్పష్టం చేశారు. సిద్ధార్థ్ చర్యలు ఇప్పటికే ఆకాశ్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుండడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన సోదరుడు ఆనంద్ కుమార్‌కు పార్టీ వ్యవహారాలను నిర్వహించగల సామర్థ్యం ఉందని..అతడిపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ముకానీయలేదని అన్నారు.బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గతంలో తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించి..తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాశ్ ఇంకా పరిణతి సాధించలేదని అప్పట్లో పేర్కొన్నారు. మరలా గతేడాది జూన్‌లో ఆయనను తన రాజకీయవారసుడిగా..పార్టీ జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. పార్టీలో పూర్తి పరిణతితో పనిచేసేందుకు ఆకాశ్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆకాశ్‌ను పార్టీ అన్ని బాధ్యతల నుంచి తొలగించిన మాయావతి !
March 02, 2025
0
Tags