లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్టాక్ మార్కెట్ లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగా ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఎల్ఐసీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ అక్షరాలా రూ. 14.9 లక్షల కోట్లు. కానీ ఫిబ్రవరి నెల ముగిసేసరికి ఆ మొత్తం కాస్తా రూ. 13.4 లక్షలకు పడిపోయింది. ఎల్ఐసీ తన పెట్టుబడుల్లో ఇంతటి భారీ పతనాన్ని చూడటం చాలా అరుదు అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దాదాపు 310 కంపెనీలలో పెట్టుబడులు కలిగిన ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో ఇంత దారుణంగా పడిపోవడం గతంలో ఎన్నడూ జరగలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఇలా ఒక్కసారిగా పతనమవ్వడానికి ప్రధాన కారణం దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడమే. మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు అయితే కోలుకోలేని విధంగా పడిపోయాయి. ఎల్ఐసీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన బడా కంపెనీల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలో రెండో అతిపెద్ద పెట్టుబడి అయిన ఐటీసీ షేర్లు ఏకంగా 18 శాతం పతనమయ్యాయి. దీంతో ఎల్ఐసీకి దాదాపు రూ. 17 వేల కోట్ల నష్టం వాటిల్లింది. టెక్నాలజీ రంగంలో దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా ఎల్ఐసీని నిరాశపరిచాయి. ఈ రెండు కంపెనీల్లో ఎల్ఐసీకి భారీగా వాటాలు ఉండగా, షేర్లు పడిపోవడంతో మరో రూ. 18 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. బ్యాంకింగ్ రంగంలోనూ ఎల్ఐసీకి ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా భారీగా క్షీణించాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అయితే ఏకంగా 30 శాతం పైగా పడిపోయి ఎల్ఐసీకి నష్టాన్ని పెంచాయి. వీటితో పాటు ఎల్ అండ్ టి, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి అనేక కంపెనీల షేర్లు కూడా ఎల్ఐసీని నష్టాల ఊబిలోకి నెట్టాయి. ఎల్ఐసీ దాదాపు 310కి పైగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటిలో చాలా వరకు కంపెనీలు నష్టాలనే చవిచూశాయి. ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్‌లోని ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలపై కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాదిలో కనీసం 35 స్టాక్స్ లో ఎల్ఐసీ ఒక్కో దానిలో వెయ్యి కోట్లకు పైగా నష్టపోయింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ పడిపోయినా బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ కార్డ్స్ వంటి కొన్ని కంపెనీల షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ, మొత్తం మీద చూస్తే ఎల్ఐసీకి భారీ నష్టమే వాటిల్లింది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎల్ఐసీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఉండటం, చిన్న మరియు మధ్య తరహా షేర్లు బలహీనంగా ఉండటం వంటి కారణాల వల్ల మార్కెట్ ఇప్పుప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. మార్కెట్ నిపుణులు కూడా ఎఫ్ఐఐ సెంటిమెంట్ మారకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
రెండు నెలల్లో రూ. 1.45 లక్షల కోట్ల ఎల్ఐసీ సంపద ఆవిరి ?
March 04, 2025
0
Tags