చైనా విషయంలో శామ్ పిట్రోడా వ్యక్తంచేసింది పార్టీ అభిప్రాయం కాదు. ఆయన మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థికపరంగా చైనా ఇప్పటికీ సవాలుగా ఉంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వివరణ ఇచ్చుకున్నారు. తరచూ సొంతపార్టీని ఇరకాటంలో పెట్టేలా శామ్ పిట్రోడా తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తుంటారు. ఈసారి చైనా గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ''చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉంది. మనం అవలంబిస్తున్న ఆ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోంది. భారత్‌కు సరైన మద్దతు దక్కట్లేదు. ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలి. ఇది కేవలం చైనా విషయంలోనే కాదు. ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏమి ముప్పుందో నాకు అర్థం కావట్లేదు. అమెరికా చైనాను తరచూ శత్రువుగా పేర్కొంటూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది'' అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న ఘర్షణల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కాగా దీనిపై భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి స్పందిస్తూ.. సున్నితంగా తిరస్కరించారు. పొరుగు దేశాలతో ఉన్న సమస్యలపై భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిట్రోడా స్పందన వచ్చింది. ఇది గాల్వన్ అమరవీరులను అవమానించడం కాదా..? అంటూ భాజపా మండిపడింది.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదు : జైరాం రమేశ్
February 17, 2025
0
Tags