చైనాలో పెరిగిన విడాకులు - తగ్గిన పెళ్లిళ్లు !

Telugu Lo Computer
0


చైనా కొంతకాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో కొన్నేళ్లుగా వివాహాలు భారీ స్థాయిలో తగ్గిపోతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాది మొత్తంగా 61లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదుకాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో విడాకుల సంఖ్య పెరగడం చైనాను కలవరపాటుకు గురిచేస్తోంది. జనాభా పెరుగుదల కోసం చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్కడి యువత మాత్రం వివాహాల వైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. చైనా పౌరవ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం.. 2024లో దేశవ్యాప్తంగా 61లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 20.5శాతం తగ్గాయి. వివాహాల రిజిస్ట్రేషన్‌ మొదలుపెట్టిన 1986 నుంచి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. 2013లో 1.3 కోట్ల వివాహాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా నమోదైంది. మరోవైపు దేశంలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. గతేడాది 26లక్షల జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 వేలు అధికం. వీటి సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టిన చైనా ప్రభుత్వం.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 30రోజుల 'కూలింగ్‌-ఆఫ్‌' వ్యవధిని తప్పనిసరి చేసింది. 2021 నుంచి దీనిని అమలు చేస్తున్నప్పటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనాలో గతేడాది శ్రామిక జనాభా (16-59) 68.3లక్షలు తగ్గినట్లు తాజా నివేదిక పేర్కొంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకుపైగా వయసు కలిగిన వారు 22శాతానికి పెరిగినట్లు తేలింది. మొత్తంగా దేశంలో జనాభా తగ్గుదలకు వివాహల సంఖ్య తగ్గిపోవడమూ ఓ కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. యువత మాత్రం వివాహం, పిల్లల వైపు మొగ్గుచూపడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)