విశాఖ జిల్లా భీమిలి తీర ప్రాంతంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) పరిధి ఎంతో సర్వే చేయాలని, అక్రమ నిర్మాణాలుంటే కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై వారంలో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విశాఖ జిల్లాలో సీఆర్‌జడ్ పరిధిని తేల్చి, అందులో అక్రమ నిర్మాణాలను కూల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక శాఖ అధికారులు మరొక శాఖపై బాధ్యతను నెట్టుకుంటూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా మేల్కొనాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఆర్‌జడ్ పరిధిని తేల్చడానికి ఇబ్బందేంటని సూటిగా ప్రశ్నించింది. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజడ్‌ఎంఏ), జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. నిబద్ధత గల అధికారుల బృందంతో సర్వే చేయించాలని కమిటీకి స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్వేను భీమిలికి పరిమితం చేస్తున్నామని, తర్వాత భీమిలి నుంచి విశాఖలోని ఆర్‌కే బీచ్ వరకు సర్వే చేయిస్తామని తేల్చి చెప్పింది. నివేదిక ఇవ్వడంలో విఫలమైతే తదుపరి విచారణకు హాజరుకావాలని కమిటీ సభ్యులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భీమునిపట్నం (భీమిలి) సీఆర్‌జడ్ జోన్ పరిధిలో శాశ్వత రెస్ట్రోబార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికికి ప్రమాదం పొంచి ఉందంటూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఆర్‌జడ్ పరిధి నిర్ణయించి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది.
భీమిలి బీచ్‌లో సర్వే చేసి, అక్రమ నిర్మాణాలుంటే కూల్చేయండి : హైకోర్టు ఆదేశాలు
February 08, 2025
0
Tags