ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తన సత్తా చాటినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంగోలు గిత్త రూ.41కోట్లు పలకడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ప్రసిద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని వెల్లడించారు. మిలమిల మెరిసే తెల్లటి శరీరం, చలి, వేడిని తట్టుకునే శరీరతత్వం.. చూపరులను ఆకట్టుకునే మూపురం, రంకెల్లో రాజసం ఒంగోలు జాతి పశువుల పేరెత్తగానే జంతు ప్రేమికుల కళ్లెదుట కదలాడే దృశ్యాలివి. అటువంటి వాటికి పుట్టినిల్లు ప్రకాశం జిల్లా. బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త (వియాటినా-19) ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది.
రూ.41 కోట్లు పలికిన ఒంగోలు జాతి గిత్త : సీఎం చంద్రబాబు హర్షం
February 13, 2025
0
Tags