న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘోర తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 11 మంది మహిళలు, 4 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్ప గాయాలకుగురైనవారికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ప్రయాగరాజ్ మహాకుంభ మేళాకు వెళ్తున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా గుమిగూడారు. రాత్రి 10 గంటల సమయంలో 14, 15 నంబర్ ప్లాట్‌ఫారాలపై 15-20 నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రయాగరాజ్ స్పెషల్ రైలు 12వ ప్లాట్‌ఫాం నుండి 16వ ప్లాట్‌ఫాం కు మార్చడంతో ఆ ప్రాంతంలో మరింత గందరగోళం నెలకొంది. ప్లాట్‌ఫామ్ 12 వద్ద వేచివున్నవారు, బయట ఉన్నవారు ఒక్కసారిగా 16వ ప్లాట్‌ఫాం వైపు కదిలి, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు కిందపడి ప్రణాలుకోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.పి.ఎస్ మల్హోత్రా మాట్లాడుతూ "భక్తుల భారీ రద్దీని అంచనా వేయగలిగాం, కానీ ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఏర్పడింది. రైలు ఆలస్యం కావడం, ప్రయాణికుల అధిక సంఖ్య వల్ల ప్రమాదం సంభవించింది," అని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే బోర్డు స్పందిస్తూ దర్యాప్తుకు రెండు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రయాణికులను ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు పంపిస్తున్నామని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. తొక్కిసలాట తర్వాత నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రభావితులందరికీ అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం," అంటూ X లో పోస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కే. సక్సేనా కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. స్టేషన్ వద్ద భారీ రద్దీని చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ తొక్కిసలాటలో మృతి చెందిన వారికి రూ.10 లక్షల నష్ట పరిహారం
February 16, 2025
0
Tags