వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు సాధారణం : దిల్‌రాజు

Telugu Lo Computer
0


ఐటీ సోదాలను ఉద్దేశించి నిర్మాత దిల్‌ రాజు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ''ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలిసీ తెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్‌ చేస్తున్నారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్‌ బుక్స్‌ చెక్‌ చేశారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు సాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది.. ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలు హైలైట్‌ చేశారు. మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. మావద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, డబ్బును అధికారులు గుర్తించలేదు'' అని దిల్‌ రాజు తెలిపారు. ''నా వద్ద రూ.5 లక్షలు, శిరీష్‌ వద్ద రూ.నాలుగున్నర లక్షలు, మా కుమార్తె వద్ద రూ.ఆరున్నర లక్షలు, ఆఫీస్‌లో రూ.రెండున్నర లక్షలు ఇలా మొత్తం సుమారు రూ.20 లక్షల కంటే తక్కువే డబ్బు ఉంది. అది కూడా అనధికార డబ్బు కాదు. దానికి కూడా డాక్యుమెంట్స్‌ ఉన్నాయి. లిమిట్స్‌ ప్రకారమే బంగారం కూడా ఉంది. ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ప్రోపర్టీలు కొనుగోలు చేయలేదు. పెట్టుబడులు పెట్టలేదు. బిజినెస్‌ విషయంలో వారికి అన్ని వివరాలు ఇచ్చాం. 24 క్రాఫ్టుల్లో లావాదేవీలు ఎలా జరిగాయనేది చెప్పాం. డిపార్ట్‌మెంట్‌ కూడా ఆశ్చర్యపోయింది. ఈ దాడులకు మేము పూర్తిగా సహకరించాం. అందరి అకౌంట్‌ విషయాలు క్లీన్‌గా ఉన్నాయి. అమ్మకు 19వ తేదీన జలుబు, దగ్గు ఎక్కువైంది. సడెన్‌గా దగ్గు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి పంపించాం. ఆమెకు గుండెపోటు అన్నట్లు కొంతమంది వార్తలు రాశారు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు 81 ఏళ్లు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జి అవుతారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల దగ్గు ఎక్కువగా వచ్చింది. దానికి సంబంధించి ఆమె ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. మీకు తెలిసీ తెలియని విషయాల గురించి హైలైట్‌ చేయొద్దు అని మరోసారి మీడియాను కోరుతున్నా'' అని దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. ఏమీ లేని దానికి ఎక్కువగా ఊహించుకొని హైలైట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. ఫేక్‌ కలెక్షన్స్‌ వల్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయని వస్తోన్న వార్తలపై స్పందించారు. ''ఇండస్ట్రీలోని అందరూ కలిసి దానిపై మాట్లాడతాం. ఆ విషయంపై నేను వ్యక్తిగతంగా కామెంట్‌ చేయకూడదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇండస్ట్రీ తరఫున కరెక్ట్‌ చేయాల్సి ఉంది. 90శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్‌మనీ సమస్య లేదు'' అని ఆయన తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)