అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదైంది. కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద ప్రవాహం కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముందనే ఆందోళన మొదలైంది. అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్ ఏంజెలెస్ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వర్షం కురవనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అనేక ప్రాంతాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మరోవైపు కొండప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్స్ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటివి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని, ఇందుకోసం సంసిద్ధంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, ఆస్బెస్టాస్, ప్లాస్టిక్, సీసం వంటివి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన మొదలైంది. దీంతో ఈ కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదు
January 26, 2025
0
Tags