చెన్నైకోచ్‌ ఫ్యాక్టరీలో రాబోయే రెండేళ్లలో 50 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీ !

Telugu Lo Computer
0


చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీలో రాబోయే రెండేళ్లలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. అమృత్‌భారత్‌ వెర్షన్‌ 2.0 రైళ్లలో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్‌ భారత్‌ రైళ్లతో పాటు, వందేభారత్‌ 2.0 స్లీపర్‌ రైళ్ల తయారీని పరిశీలించారు. 2024 జనవరిలో అమృత్‌ భారత్ వెర్షన్‌ 1.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని మంత్రి తెలిపారు. ఏడాదిలో వచ్చిన స్పందన ఆధారంగా వెర్షన్‌ 2.0ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కొత్తగా 12 రకాల ఫీచర్లను జోడించినట్లు తెలిపారు. సెమీ ఆటోమేటిక్‌ కప్లెట్స్‌, మాడ్యులర్‌ టాయిలెట్స్‌, ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ ఫీచర్‌, ఎమర్జెన్సీ బ్రేక్‌ సిస్టమ్‌, వందే భారత్‌ రైళ్ల తరహాలో నిరంతరం వెలిగే లైట్లు, ఛార్జింగ్‌ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్‌ కూడా మార్చినట్లు వెల్లడించారు. ప్యాంట్రీ కారును సమూలంగా మార్చినట్లు తెలిపారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొచ్చామని, తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వివరించారు. అమృత్‌ భారత్‌ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి ఎక్స్‌లో ఓ థ్రెడ్‌ను కూడా మంత్రి పోస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)