ఉత్తరాఖండ్ లో జనవరి 27 నుంచి సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటి నుంచి ఒకటే రూల్ వర్తించనుంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాలను పూర్తి చేశామన్నారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ధామి.. యూసీసీ అమలు వలన అన్ని మతాలు, కులాలు ఒకేథాటిపైకి వస్తాయన్నారు. ఎలాంటి వివక్ష ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చామని.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యూసీసీనే బీజేపీ ప్రధానాస్త్రంగా ఉంటోంది. ఎట్టకేలకు ఈ సారి అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని అధికరణ 44 ప్రకారం వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ బేధాలు లేకుండా అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో లింగ సమానత్వాన్ని సాధించేందుకు యూసీసీ దోహదం చేయనుంది. యూసీసీ రూల్స్ ప్రకారం సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు.
ఉత్తరాఖండ్ లో జనవరి 27 ఉమ్మడి పౌరస్మృతి అమలు !
January 26, 2025
0
Tags